- మేం కక్షపూరితంగా కేసులు పెట్టలేదు
- ఒత్తిడితోనే తప్పులు చేశామని అధికారులు ఒప్పుకున్నరు
- ఈ నెల 26 నుంచి మరో నాలుగు సంక్షేమ పథకాల అమలు చేస్తామని వెల్లడి
ఖమ్మం, వెలుగు: లొట్టపీసు అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్న భాషకు, ఆయన సంస్కారానికి నమస్కారమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విదేశాల్లో ఆయన చదువుకున్నదిదేనా అని ప్రశ్నించారు. శనివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం ఎవరి మీదా కక్షపూరితంగా కేసులు పెట్టలేదని తెలిపారు.
కేటీఆర్ ఒత్తిడి వల్లే తాము తప్పులు చేశామని అధికారులు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. విచారణ పూర్తికాకుండా అరెస్ట్ ఉండదని, కేటీఆర్ అరెస్ట్ విషయంలో తొందరపడడం లేదని, ఈ విషయంలో చట్టం పని తాను చేసుకుపోతున్నదని చెప్పారు. ప్రభుత్వం, సీఎం రేవంత్‌పై కేటీఆర్ మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, తాము కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఏసీబీ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా ఎంటరైందని, ఈడీ ద్వారా కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా అని ప్రశ్నించారు.
ఈ నెల 26 నుంచి మరో 4 సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. ధరణిని ఉపయోగించుకుని అక్రమంగా లబ్ధి పొందిన వారిని వదలబోమని పొంగులేటి హెచ్చరించారు. 59 జీవో ద్వారా అక్రమంగా బీఆర్ఎస్ నేతలు రెగ్యులరైజ్ చేసుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
రైతుకు అన్యాయం జరగకూడదనే భూభారతి..
రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకూడదనే భూ భారతి చట్టం అమలుపై తొందరపడడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఈ చట్టం లైవ్‌లోకి వస్తుందని తెలిపారు. ధరణిలో ఏదైనా తప్పు జరిగితే రైతులు కోర్టుకు వెళ్లడమే తప్పించి అధికారులకు అప్పీల్ చేసే వ్యవస్థ ఉండేది కాదని, భూ భారతి ద్వారా అప్పీల్ వ్యవస్థను తీసుకువస్తున్నామని చెప్పారు.
కర్నాటకలో రిజిస్ట్రేషన్ తర్వాత పేపర్లతో పాటు భూమి మ్యాప్‌ను ఇచ్చే విధానం అమలవుతోందని, ఇక్కడ కూడా దానిని అమలు చేసేందుకు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల చిక్కుల పరిష్కారానికి రెవెన్యూ గ్రామం యూనిట్‌గా రెవెన్యూ అధికారిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, రైతు భరోసా కోసం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఆయన వెల్లడించారు.
శనివారం నుంచి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులను కలుపుకొని లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష ప్రారంభమైందన్నారు. 16 నుంచి అర్హుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇండ్ల కోసం 80 లక్షల 60 వేల అప్లికేషన్లు వచ్చాయని, జీహెచ్ఎంసీ మినహా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరి వివరాలు యాప్ ద్వారా సేకరించామని చెప్పారు. అంతకు ముందు ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగులో నిర్మించిన 80 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి ప్రారంభించి, పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు.